చైతన్య…
( కథ )…
దక్షిణ కాశీగా ప్రాచుర్యంలో ఉన్న వేములవాడ పట్టణం. ఆలయం నుంచి ఓం నమ శివాయ అంటూ మైకులు హోరెత్తిస్తున్నాయి.
పట్టణమంతా శివ నామస్మరణలు వాహనాల రణగొణల్లో కలిసిపోయి వినిపిస్తున్నది.
వచ్చిపోయే భక్తులతో రద్దిగా ఉంది భీమేశ్వర గుడికి పోయే రోడ్డు ఉదయం తొమ్మిది దాటింది.
మల్లేశం హోటల్ కాడ టిఫిన్ చేద్దామని వచ్చిన.
టిఫిన్ సెంటర్ వచ్చిపోయే భక్తులు, స్థానికులతో కలగలిసి కిక్కిరిసి పోయింది.
వాతావరణం చూస్తే కొనుక్కొని తినేటోని కంటే అడుక్కొని తినేటోని పరిస్థితే నాయమనిపించింది.
ఎలాగోలా పోటీపడి దోష తీసుకుని పక్కకు నిలబడి తింటున్న. అంతలోనే పల్సర్ బండి వేసుకుని బద్దిపోచమ్మ దిక్కు పోతున్నా శేఖర్ నన్ను చూసి అగిండు.శీను ఖాళీగానే ఉన్నావా అన్నాడు.
వీడు మల్ల ఏమన్నా మందు ప్రోగ్రాం గిట్ల పెట్టిండా అని మనసులో అనుకున్నా.
ఏం లేదు సనుగుల దాకా పోయోచ్చేది ఉంది అన్నడు.
తినుడు ముగించేసి చేతులు కడుక్కుని బండెక్కిన.
బండి బద్ది పోచమ్మ గుడి దాటుకొని చెక్కపల్లి బస్టాండ్ దాటుకుంటూ కోరుట్ల బస్టాండ్ వైపు సాగుతుంది.
హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినావ్ రా అని అడిగిండు. నిన్న రాత్రి వచ్చినా రెండు మూడు రోజులు ఉంటా అని చెప్పిన. మొత్తానికి హైదరాబాదోనివి అయినవ్ అంటూ ముచ్చట్లు మొదలుపెట్టిండు. మా డాడీకి ఉద్యోగం రావడంతో హైదరాబాద్ లోనే సెటిల్ ఐనం. చిన్న బాపు నానమ్మ అందరూ ఇక్కడనే ఉంటారు. అప్పుడప్పుడు ఫంక్షన్లకు కు వచ్చి పోతుంటం. శేఖర్ నాకు చిన్నప్పటి నుంచి సోపతి. సుభాష్ నగర్ లో మా ఇంటి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు ఉంటుంది.
చదువు అయిపోయినంక హైదరాబాద్ లోనే ఓ టీవీ ఛానల్లో పనిచేస్తున్న. శేఖర్ ఇక్కడే వారసత్వంగా వస్తున్న ప్రైవేట్ లాడ్జిలు నిర్వహణ చూసుకుంటున్నాడు ఆదాయానికి లోటు లేదు. ఇద్దరి మధ్య చిన్నప్పుడు కుదిరిన సోపతి. అట్లా సాగుతూనే ఉన్నది. వేములవాడకు వచ్చినానంటే శేఖర్ ను కలవాల్సిందే కలిసి మందు కొట్టాల్సిందే.. దేశంలో ఎక్కడెక్కడి ముచ్చట్లు మాట్లాడుకోవాలిసిందే.ఏం రా శీను నా ఓర్రుడు నేనే ఒర్రుతున్నా సప్పుడు చేస్తలేవ్ ఏందిరా అన్నాడు.
మెల్లగా గతంలోంచి వర్తమానం లోకి వచ్చిన.
ముచ్చట్ల మధ్య బండి ముందుకు సాగుతుంది.
మధ్య మధ్యలో శేఖర్ కు పరిచయం ఉన్న వాళ్లు పలకరిస్తున్నారు. జోగాపూర్ కిష్టంపేట్ దాటుకుని సనుగుల గ్రామంలోకి అడుగు పెట్టాం. అలా ఊర్లోకి వెళ్తుంటే రంగు వెలిసిపోయిన స్థూపం కనిపించింది.
అలా ఇంకొంచెం ముందుకు వెళితే మేము చేరుకోవాల్సిన రంజిత్ ఇంటికి చేరుకున్నం. శేఖర్ బండి హారన్ కొట్టుడుతోనే రంజిత్ బయటకు వచ్చిండు. బయట ఉండి హారన్ కొట్టుడు ఏందిరా సక్కగా ఇంట్లోకి వచ్చేదానికి అంటూ పలకరించిండు.
బండి ఓ పక్కకు పెట్టి ఇంట్లోకి . పోయినం. శేఖర్ ను చూసుడుతోనే రంజిత్ వాళ్ళ అమ్మ కౌసల్య ఇంట్లో అందరూ మంచిగున్నారా కొడుక అని పలకరించింది.
అందరం మంచిగానే ఉన్నారు. మీరు మంచిగున్నారా అని పలకరించాడు శేఖర్.
ఇట్లా బాగోగుల ముచ్చట్లు సాగుతున్నయ్.
రంజిత్ శేఖర్ లు ముచ్చట్ల పడ్డారు.
రంజిత్ కయితే సంతోషంగా ఉన్నది.
శేఖర్ వేములవాడ వదిలిపెట్టి పక్కాగా తనకోసం రావడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. చదువుకునే రోజులనుంచి ఇప్పటిదాకా జరిగిన పరిస్థితులను మిత్రులిద్దరూ కలబోసుకున్నరు.
కాలం ఇట్టే గడిచిపోయినట్టు అనిపించింది.
అంతలోనే రంజిత్ వాళ్ళ అమ్మ కౌసల్య భోజనాలు సిద్ధం చేసి తినడానికి రమ్మని పిలిచింది. నాకు కొంచెం మొహమాటం అనిపించింది కొత్తగా పరిచయమయే.
నా మొహామటన్ని గమనించిన రంజిత్ తమ్మి ఇది మన ఇల్లే అనుకో అట్లా మొహమాట పడితే ఎట్లా అని బుదురకిచిండు.
కౌసల్యమ్మ తిందురండ్రి బిడ్డ అంటూ మల్లోసారి పిలవడంతో అందరం భోజనాలకు సిద్ధమైనాం.
భోజనాలు పూర్తి చేసేసరికి మధ్యాహ్నం మూడు గంటలు దాటింది. భోజనం చేశాక వాకిట్లో మంచం వాల్చి ఉంటే శేఖర్ అట్లా ఒరిగిండు నేను రంజిత్ పక్కపక్కనే కూర్చున్నాం. సంజీవ్ అక్క శ్రీమతి వాకిట్లో కుసోని బీడీలు చూడుతోంది.
అమ్మ కడపల కూర్చొని ఉన్నది.
ఒకసారి చుట్టూ అంతా పరిశీలనగా చూసిన.
సరిగ్గా అమ్మ కౌసల్య కూర్చున్న వైపు ఇంట్లోకి చూస్తే ఎదురుగా రెండు ఫోటోలు కనిపించాయి. పోటోలను పరిశీలనగా చూస్తున్నా.గమనించిన అమ్మ అవి వీళ్ళ బాపు, అక్కల పోటోలని రంజిత్ ను చూపిస్తూ చెప్పింది.రెండు ఫోటోలు గొడమిదినుంచి తీసి ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంది.
మొదటిది శంకరన్న ఫోటో రెండోది తన కూతురు చైతన్య ఫోటో అని చెప్పింది. అట్లా కౌసల్యమ్మ గతంలోకి జ్ఞాపకాల్లోకి తీసుకు వెళ్ళింది. నిమ్మపల్లిలో మొదలైన భూ పోరాటాలు.దొరల పెత్తనానికి వ్యతిరేకంగా గ్రామల్లోని అట్టడుగు వర్గాల ప్రజలు ఎదురు తిరుగుతున్న జ్ఞాపకాలు.. అవి ప్రతిఘటన పోరాటాలు రూపాంతరం చెందుతున్న తీరును తనదైన మాటలు చెప్పుకు పోతుంది. అట్లా సనుగుల గ్రామంలోకి వచ్చిన పోరాటాలు ప్రజలను నడిపించిన తీరు చెప్పింది. ముందు నుంచే శంకరన్న ఒకరు మాటంటే పడే రకం కాదు. తాను ఒకల జోలికి పోయేటోడు కాదు.అట్లని పెత్తనం చేసేందుకు చూస్తే ఉకునేటోడు కాదు.అట్లా పల్లె పల్లెను అల్లుకున్న పోరాటాలను గుండెలకు హత్తకున్నాడు శంకరన్న. క్రమక్రమంగా రైతాంగ పోరాటాలు ప్రతిఘటన పోరాటంగా మలుపు తీసుకున్నవి.
సామాన్యులు అన్నలై పీడిత ప్రజలకు అండగా దళాలు నిర్మాణంల్లోకి వచ్చిండ్రు.
పేదల మంచి కోసమే జరుగుతున్న పోరాటాల్లో శంకరన్న తాను భాగమైండు. ఈ ప్రాంతంలోని తొలితరం నాయకులందరికీ ఆత్మీయుడు అయ్యిండు అని చెప్పి గుండెలోతుల్లోంచి పొంగుకొస్తున్నా దుఃఖాన్ని అదిమి పెట్టుకొని రాలుతున్న కన్నీళ్లను తుడుచుకుంది.
ఏం చెప్పాలి బిడ్డ ఒక బాధ కాదు ఒక దుఃఖం కాదు.
పెయ్యి నిండా పోలీసు దెబ్బలేనాయే.
ఏక్కడెం జరిగిన పోలీసులు వచ్చి ఈయనను పట్టుకపోయి పోలీసు స్టేషన్ల చుట్టూతిప్పుడేనాయే.
ఆఖరికి ఆ దెబ్బల తోనే ప్రాణం పోయే.. అని చెబుతూ కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంది.
చీర కొంగుతో చైతన్య ఫోటోను తుడుస్తూ తదేకంగా చూస్తుంది. తల్లి మనుసులో సుడులు తిరుగుతున్న బాదను రాయడానికి అక్షరాలు సరిపోవు అనిపించింది. బహుశా ఆ తల్లికి బుడి బుడి అడుగులతో నడుస్తూ చలాకీగా ఉండే పసితనపు చైతన్య గానే ఇంకా మనుసులో ఉన్నదేమో…
కౌసల్యమ్మ చైతన్య గురించి చెప్పడం మొదలు పెట్టింది. కుటుంబ పరిస్థితుల వల్ల చిన్నతనంలోనే బీడీలు చుడుతూ కుటుంబానికి సహాయంగా ఉండేది. అప్పటికే దళాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా వస్తుండేవి. బిడ్డ ఎప్పుడు అన్నలతో కలిసిందో ఏమో అని చెబుతూ శూన్యంలోకి చూస్తుంది కౌసల్యమ్మ. అప్పటిదాకా అమ్మ చెబుతున్న మాటలను వింటున్న శ్రీమతి తమ చెల్లితో ఉన్న అనుబంధాన్ని ఆనాటి పరిస్థితులను చెప్పుకోచ్చింది.ఇద్దరం కలిసి బీడీలు చుడుతూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు ఊరికి వచ్చిపోయే అరుణక్క ఇక్కడ బీడీ కార్మికులతో కలిసిపోయి ముచ్చట్లు చెప్పేది. కలిసికట్టుగా ఉంటే మన హక్కులను సాధించుకుంటామని చెప్పేది. అరుణక్క వచ్చి చెప్పిన ముచ్చట్లు శ్రద్ధగా వినేది చైతన్య.
అట్లా అరుణక్కకు చైతన్యకు మధ్య ఉద్యమ ఆత్మీయ సంబంధం ఏర్పడ్డది.
చైతన్య అందరితో కలుపుగోలుగా ఉంటూ ఏ విషయమైనా నిర్భయంగా మాట్లాడేది.
తప్పు ఉంటే నిలదీసి ప్రశ్నించేది. ప్రజల కోసం కొట్లాడుతున్న అన్నలంటే ప్రాణం పెట్టేది..
ఇట్లా రోజులు గడుస్తుండగానే ఊర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్లో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.మిగిలిన వాళ్ళు తప్పుకుని పోగా మరొకరు మాత్రం తప్పుకుని ఊర్లో ఓ ఇంట్లో రక్షణ కోసం వెళ్లడాన్ని గమనించిన పోలీసులు ఇంటిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. సాయంకాలం 6 గంటలకు ప్రారంభమైన కాల్పులు తెల్లవారుజాము వరకు కొనసాగాయి..కొట్లాటలో అన్నల ప్రాణాలు పోయినాయి.ఊరోల్ల అందరితోపాటు ఎన్కౌంటర్ లో మరణించిన అన్నలను చూసి వచ్చిన చైతన్యలో క్రమక్రమంగా మార్పు రావడం ప్రారంభమైంది..
ఊపిరి ఉన్నంతవరకు నమ్మిన ఆశయం కోసం నిలబడ్డ అన్నల త్యాగం ఎంత గొప్పదో కదా అని ఆ రోజంతా మాతో చెప్పింది చైతన్య అంటూ శ్రీమతి తన చెల్లెలు జ్ఞాపకాలు తడిమి చూసుకుంటూ చెప్పింది. ఇది జరిగిన కొన్ని రోజులకు బీడీల చాట మధ్యలోనే వదిలేసి వెళ్ళింది.సోపతోల్ల దగ్గరికి పోయిందని అనుకున్నాం. సాయంత్రమైన జాడలేదు.
అప్పటికే జరిగిన విషయాలన్ని బాపుకి చెప్పినా అని శ్రీమతి అనుకొచ్చింది.కౌసల్యమ్మ చైతన్య పోటో ను తదేకంకగా చూస్తూ అప్పటి సంధి బిడ్డ యడుందంటే అడికి పోయినాం. చెట్టుకు, పుట్టకు తిరిగినాం.
జగిత్యాల దగ్గర ఉన్నదంటే అడికి పోయినం.
బిడ్డను చూడంగానే దుఖం ఆగలేదు.
ఇంటికి రా బిడ్డా అని ఎంత బతిమాలినా రాలే. సముదాయించి పంపుతామని అన్నలు చెప్పిండ్రు.
పుట్టెడు దుఖంతోనే ఇంటికి వచ్చినం..
కొన్ని రోజులకు దళం తోని వచ్చిందని తెలుసుకుని పోయి బలవంతంగా తీసుకువచ్చినాం.
మాతోని వాదన పెట్టుకుంది.మిరెన్ని చెప్పిన నా మనసంతా ప్రజల కోసం పనిజెయ్యలనే ఉంటది.
నా ప్రాణాలు ప్రజల కొసమే నమ్మిన సిద్ధాంతం విలువల కోసమే దళం లో చేరినా. మీరు నన్ను ఇక్కడే ఆపితే బతికినా చచ్చినట్టే.అని అన్నం నీళ్లు ముట్టలే.శంకరన్న కూడా సలిచ్చుకున్నడు.
కచ్చితంగా తాను అదే తొవ్వాల పోవలనుకుంటే ఎన్నిరోజులు అపుతం.తన ఇష్టం ఉన్నట్టే కానియ్యి అన్నడు.ఎడుసుకుంటనే వాన పడంగ చెత్తిరి పట్టుకొని పోయి ఊరు దాటిచ్చినా.అదే బిడ్డను ఆఖరి సారి చుసుడు.నూకలమర్రిల బిడ్డను చంపీ ఇంట్లనే కాల్చి బూడిద చేసేదాకా పోలీసుల కండ్లు సళ్లవడలే.. అంటు కౌసల్యమ్మ కన్నీళ్లు తుడుచుకుంది.
ఇరవై రెండేండ్లు గడిచిపోయినా బిడ్డను పోగొట్టుకున్నా తల్లి మనసులో గాయలింక పచ్చిగానే ఉన్నాయి.కౌసల్యమ్మ కండ్లముందే కరిగిపోయిన నలభై ఏండ్ల కాలం వెల్లువెత్తిన పోరాటాలను ఉపిరి సలపనివ్వని నిర్బంధాలను ఎన్నిటిని దాటివచ్చిందో శూన్యంలోకి చూస్తున్నా కౌసల్యమ్మ అర్ధతతో చూసే చూపుల్లో తెలంగాణ పల్లెల్లో ఎందరో అమ్మల అసమానమైన త్యాగాలు.కండ్లముందు కనిపించాయి. జర్నలిజం కోర్స్ చేస్తున్నప్పుడు చదువుకున్నా గోర్కీ రాసిన అమ్మ నవల యాది కొచ్చింది..దోపిడీ లేని సమాజం కోసం ప్రాణాలను తృణపయంగా ధారపోసిన చైతన్య గురించి ఆలోచిస్తుంటే మనుసులో తెలియని భావోద్వేగం.
శీను పోదామా అనుడుతోని సరే అని లేసినా.
ఎందుకో పెరట్లోని జమచెట్టు మీద ఉరవిస్కెలు మాతో పాటు కౌసల్యమ్మ చెప్పిన యతాలు విన్నయో ఏమో అదే పనిగా అలికిడి చేస్తున్నై.
చూస్తుంటే అవి వీరుల జ్ఞాపకాలను స్మరిస్తున్నట్లే అనిపించింది. రంజిత్ కు కౌసల్యమ్మ కు పోయస్తమనీ చెప్పి సెలవ్ తీసుకున్నాం..
శేఖర్ బండి చాల్ జేసిండు.సనుగుల అమరవీరుల స్తూపం దాటుకుని ముందుకు కదిలింది అట్లా తిరుగు ప్రయాణంలో ఒక్కో ఊరుదాటుకుంటూ వస్తుంటే ఆ ఊర్లాళ్ల ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహాలు నాకెందకో కొత్తగా కనిపిస్తున్నట్లు అనిపించింది. పల్లెలకు కొత్త పోరాట పాఠాలు నేర్పిన ఉద్యమాల గుర్తులు కండ్లముందు మెదులుతున్నై. ఏమ్రా శీను ఇప్పుడు ఇదంతా స్టోరీ జేసీ నీ ఛానళ్ల పెడతావా ఏంది నవ్వుతూ అన్నాడు శేకర్.
అవునే శేకరన్న మనం పుట్టి పెరిగిన నేలమీద గిన్ని పోరాటాలు జరిగాయని నాకే తెల్వదు.
భవిష్యత్ తరాలకు చరిత్ర అయితే ఖచ్చితంగా తెల్వలే..గిప్పుడు మీడియా సంగతి నీకు తెల్వంది ఏముంది.సినిమా హీరోయిన్ చెప్పులేసుకుని తిరుపతికి పోయిందంటే చెప్పులను కాళ్లను తిప్పి తిప్పి సుపియ్యలే ఇప్పుడు గిదే ట్రెండ్ నడుస్తోంది.
అని చెప్పుడు తొనీ శేఖర్ ఒక్కసారిగా నవ్వుడు సురువు చేసిండు. మా ముచ్చట్లట్లా వేములవాడ రానే వచ్చింది.
(పదహారేళ్ల ప్రాయంలోనే విప్లవోద్యమంలో ప్రాణాలను ధారబోసిన సనుగుల “చైతన్య”. వేములవాడ రూరల్ మండలం నుకలమర్రి గ్రామాల్లో 20_07_2000న, ఎన్కౌంటర్లో చంపి సజీవదహనం చేసినా సంఘటన గురించీ విన్నపుడు..)
– పాత్రలు పరిస్థితులు యదార్థం.
– అల్లే రమేష్,జర్నలిస్ట్
సెల్.9030391963.