ఆత్మవిశ్వాసం

wow19tv
By wow19tv

ఆత్మవిశ్వాసం
ఓ వ్యాపారవేత్త వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల పాలయ్యాడు. అందులో నుంచి బయటపడటానికి ఎలాంటి మార్గమూ కన్పించలేదు.
అతనికి అప్పులు ఇచ్చిన వాళ్లు బాకీ తీర్చమని వేధించడం మొదలుపెట్టారు. అతనికి వస్తువులు సరఫరా చేసిన వాళ్లు డబ్బులు చెల్లించమని రోజూ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు.
ఇలాంటి పరిస్థితుల్లో అతను ఓ రోజు ఉదయం ఇందిరా పార్క్‌కి వచ్చి తల పట్టుకు కూర్చున్నాడు. తన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు.
అప్పుడే అతని దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. అతని వయసు 70 సంవత్సరాలు ఉండవచ్చు. వ్యాపారవేత్త ఏదో బాధలో వున్నట్టు అతను గమనించాడు.
‘చాలా బాధలో వున్నట్టున్నావు?’ ప్రశ్నించాడు. వ్యాపారవేత్త తన పరిస్థితిని వివరించాడు. ‘నీకు నేను సహాయం చెయ్యగలను’ చెప్పాడు ఆ వ్యక్తి.
వ్యాపారవేత్త పేరు అడిగి తెలుసుకొని పది లక్షలకి చెక్ రాసి అతనికిచ్చి ఇట్లా అన్నాడు.
‘ఈ డబ్బు అవసరమైతే వాడుకో. సరిగ్గా సంవత్సరం తరువాత ఇక్కడే కలుద్దాం. అప్పుడు ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేద్దువు’
వ్యాపారవేత్త ఆలోచించేలోపే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు. దేవుడే అతడిని పంపించాడని అనుకున్నాడు. ఆ వ్యక్తి సంతకాన్ని చూస్తే అతని పేరు సుబ్బరామిరెడ్డి అని ఉంది.
ఈ డబ్బుతో నా బాధలు తొలగిపోతాయని ఆ వ్యాపారవేత్త అనుకున్నాడు. కానీ ఆ చెక్కును అప్పుడే వాడుకోదల్చుకోలేదు. తన ఐరన్ సేఫ్‌లో భద్రపరిచి తన వ్యాపారాన్ని తిరిగి సమర్థవంతంగా కొనసాగించడం మొదలుపెట్టాడు. ఆ చెక్కు అతనికి కొండంత బలం ఇచ్చింది. అంతగా అవసరమైతే చెక్కును వాడుదామని అనుకున్నాడు.
చాలా ఆశావహంగా తన వ్యాపారాన్ని కొనసాగించాడు. తన బాకీదారులని, డిస్ట్రిబ్యూటర్లకి డబ్బు చెల్లిస్తానన్న నమ్మకం కలిగించాడు. కొన్ని నెలలు గడిచాయి. అతని వ్యాపారం అభివృద్ధి చెందింది. అప్పుల బాధ నుంచి అతను బయటపడ్డాడు.
సరిగ్గా సంవత్సరం తరువాత అతను మళ్లీ ఇందిరాపార్క్‌కి వచ్చి ఆ చెక్కు ఇచ్చిన వ్యక్తి కలిసిన ప్రదేశానికి వచ్చాడు. ఆ వ్యక్తి అక్కడ కన్పించాడు. ఆ చెక్కుని అతని చేతిలో పెట్టి తాను ఎలా వ్యాపారంలో అభివృద్ధి చెందానో అతనికి చెప్పడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే ఓ నర్సు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుంది.
‘అమ్మయ్యా! ఇతన్ని పట్టుకున్నాను’ అరిచింది ఆ నర్సు.
‘ఇతను నిన్ను విసిగిస్తున్నాడా! ఎప్పుడూ ఇంటి నుంచి పారిపోయి వస్తుంటాడు. ఇతనికి మతిస్థిమితం లేదు. ఇతని బాగోగులు నేను చూస్తుంటాను. ఎప్పుడూ ఈ పార్క్‌కే వస్తూ ఉంటాడు. రెండు సంవత్సరాలుగా ఇదే పని. ఎవరినీ ఏమీ అనడు’ అని చెప్పి అతన్ని తీసుకొని నర్స్ వెళ్లిపోయింది.
వ్యాపారవేత్త ఆశ్చర్యానికి లోనయినాడు. కొయ్యబారిపోయాడు. సంవత్సరంపాటు తన దగ్గర పది లక్షల రూపాయలు ఉన్నాయన్న ధైర్యంతో అప్పుల వాళ్లని, కస్టమర్లని, తనకు వస్తువులు సరఫరా చేసిన వ్యక్తులని సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. వాళ్లని ఒప్పించగలిగాను. కష్టాల నుంచి బయట పడగలిగాను.
కొద్దిసేపటికే అతనికి అర్థమైంది. తనను సమర్థవంతంగా ముందుకు నడిపించింది డబ్బు కాదు. తనలో ఏర్పడ్డ ఆత్మవిశ్వాసం. సాధించాలన్న కాంక్ష.
One year old collection
Writer: vamsi garu
మా పసలపూడి కధలు “వంశీ”

Share This Article
Leave a comment